7tv focus : నితిశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ మొదటి భాగం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాకు కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా మేకింగ్ పరంగా, నటీనటుల అంకితభావం పరంగా ఎక్కడా పెద్దగా నెగెటివిటీని ఎదుర్కొనలేదు. ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చి తీవ్ర విమర్శల పాలైన ‘ఆదిపురుష్’ సినిమా జ్ఞాపకాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చాయి. ‘రామాయణ’ విజయంతో పోల్చి చూస్తున్న నెటిజన్లు, మీమర్స్ గతంలో ‘ఆదిపురుష్’ చేసిన ప్రయోగాన్ని, దాని పేలవమైన గ్రాఫిక్స్, పాత్రల రూపకల్పనను మరోసారి తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడమే కాకుండా, విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో ప్రభాస్ గెటప్ సరిగ్గా లేదని, అసలు బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దర్శకుడు ఓం రౌత్ తీరుపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమా ప్రేక్షకులకు, చిత్ర యూనిట్‌కు ఒక పీడకలగా మిగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

