గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఎస్ఐ ఆలకుంట్ల రవికి ఘన సన్మానం…
7 టీవీ ఫోకస్, గచ్చిబౌలి, జూలై 5: వడ్డెర సమాజం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు పిలుపునిచ్చారు. యువత లక్ష్యసాధనతో ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పదవులు సాధించడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఆలకుంట్ల రవిని శుక్రవారం గచ్చిబౌలి డీఎల్ఎఫ్లోని ఎం.కే. తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చూపుతున్న క్రమశిక్షణ, ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు పీట్ల మల్లేష్ మాట్లాడుతూ వడ్డెర సమాజం అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని అన్నారు. ఒకప్పుడు వెనుకబడిన వర్గంగా గుర్తింపు పొందిన వడ్డెరలు నేడు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ప్రగతి మరింత వేగవంతం కావాలంటే ప్రతి కుటుంబం తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. యువత ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు, సివిల్ సర్వీసులు, సాంకేతిక, వైద్య, న్యాయ, వ్యాపార రంగాల్లో రాణించి సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షుడు పీట్ల కథాల్ మాట్లాడుతూ వడ్డెర యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-1 వంటి అత్యున్నత ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకొని కృషి చేయాలని సూచించారు.

విద్యతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రతి విద్యావంతుడు, ప్రతి ఉద్యోగి తమ మూలాలను మరచిపోకుండా వడ్డెర సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. అన్ని రంగాల్లో వడ్డెరలు ఆదర్శంగా నిలిచే రోజులు రావాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆలకుంట్ల రవి ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఇద్దరు నాయకులు కొనియాడారు. సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్మరాజుల శేఖర్, బోదాస్ నరసింహ, తుర్క వీరబాబు, శివరాత్రి వెంకటేష్, ఓర్సు బాలకృష్ణ, ఇరుగదిండ్ల రమేష్తో పాటు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొని ట్రాఫిక్ ఎస్ఐ ఆలకుంట్ల రవిని అభినందించారు.

