బుట్టాయిగూడెం, జూలై 6 (7 టీవీ ఫోకస్): జ్వరం, వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నాలుగేళ్ల గిరిజన చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె మృతికి కారణమని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొర్సారిగూడెం పంచాయతీ మోతుగూడెం గ్రామానికి చెందిన గోగుల వెంకటరెడ్డి, సునీత దంపతుల నాలుగేళ్ల కుమార్తె జేత్వికకు జ్వరం, వాంతులు, విరేచనాలు రావడంతో శనివారం రాత్రి సుమారు 8.50 గంటలకు బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి దాదాపు 28 గంటల పాటు సరైన వైద్య సేవలు అందించలేదని, చివరకు పరిస్థితి విషమించిందని చెప్పి సోమవారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. జంగారెడ్డిగూడెంలోని సాయి స్ఫూర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే జేత్విక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. “మేము గిరిజనులమనే కారణంతో మా కుమార్తె ప్రాణాన్ని నిర్లక్ష్యం చేశారా? సకాలంలో చికిత్స అందించి ఉంటే మా పాప ప్రాణాలతో ఉండేది” అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె మృతికి కారణమని ఆరోపిస్తూ, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

