పోలవరం, జూలై 5 (7 టీవీ ఫోకస్): వైద్య ఆరోగ్య శాఖలో దశాబ్దాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఆఫ్తాల్మిక్ అధికారి బొల్లిన నాగకిషోర్ను ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ఆదర్శప్రాయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొనియాడారు. కొయ్యలగూడెంలో ది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మేక్స్ లిమిటెడ్ అధ్యక్షుడిగా విశేష సేవలందించి, అనంతరం నందాపురం ఆఫ్తాల్మిక్ అధికారిగా పదవీ విరమణ పొందిన బొల్లిన నాగకిషోర్కు అభినందన, సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై బొల్లిన నాగకిషోర్కు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో నాగకిషోర్ అందించిన సేవలు ప్రశంసనీయమని, ఉద్యోగ జీవితమంతా ప్రజలకు అంకితభావంతో సేవలందించి సహచర ఉద్యోగుల అభిమానాన్ని సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆరోగ్యంతో కూడిన ఆనందకర జీవితం కలగాలని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, దుగ్గిన శ్రీనివాస్, చిరంజీవి, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొని బొల్లిన నాగకిషోర్ను అభినందించారు.

