హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ నిర్లక్ష్యంతో హెచ్ఏఎల్ కాలనీలో మురుగు మయం
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల హెచ్ఏఎల్ కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు చేపట్టిన డ్రైనేజీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. కొత్త డ్రైనేజీ లైన్‌ను వేసినప్పటికీ పాత డ్రైనేజీ లైన్‌ను కొత్త లైన్‌కు అనుసంధానం చేయకపోవడంతో పాత మురుగు మార్గం పూర్తిగా మూసుకుపోయి, మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ రెసిడెంట్స్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లిఖితపూర్వకంగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. జీడిమెట్ల గాజులరామారం రోడ్డులోని హెచ్ఏఎల్ కాలనీలో ఇటీవల హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కొత్త డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు చేపట్టింది.

అయితే నాలుగో రోడ్డులో కుడివైపు ఉన్న పాత మ్యాన్‌హోల్‌ను కొత్త లైన్‌కు అనుసంధానం చేయకుండా, అదే పాత లైన్‌కే కొనసాగించడం వల్ల మొత్తం పాత డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోయిందని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. దీని కారణంగా మురుగునీరు నిరంతరం పొంగిపొర్లుతూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు సంఘం ఉపాధ్యక్షుడు వి. వీరయ్య చౌదరి తెలిపారు. ఈ విషయంపై 2026 జూన్ 23న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త డ్రైనేజీ నిర్మాణానికి భారీగా ప్రజాధనం ఖర్చు చేసినా, పాత లైన్‌ను కొత్త లైన్‌కు అనుసంధానం చేయకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వెంటనే పాత మ్యాన్‌హోల్‌ను కొత్త డ్రైనేజీ లైన్‌కు అనుసంధానం చేసి మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
” ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం “
జూన్ 23న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులకు కాలనీ సంక్షేమ సంఘం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

