బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రైజర్ అరెస్ట్.. 126 ఖాతాల్లో భారీ మోసం బట్టబయలు
ఏలూరు, జూలై 10 (7 టీవీ ఫోకస్): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలు బంగారు ఆభరణాలను అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచి సుమారు రూ.10 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రూ.5 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసాన్ని ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్. ఐపీఎస్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రధాన నిందితుడు చలపాక రాజు (40)ను అరెస్టు చేసింది. నిందితుడు అదే బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, 126 గోల్డ్ లోన్ ఖాతాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

దర్యాప్తులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను నిందితుడు అక్రమంగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంచినట్లు తేలింది. ఈ విధంగా సుమారు 6.449 కిలోల బంగారం మాయమైనట్లు నిర్ధారణ కాగా, దాని విలువ దాదాపు రూ.10 కోట్లుగా అంచనా వేశారు. అపహరించిన బంగారాన్ని జంగారెడ్డిగూడెంలోని పలు నగల దుకాణాల్లో తన పేరుతో పాటు తన తల్లిదండ్రుల పేర్లతో విక్రయించడం, తాకట్టు పెట్టడం చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుంచి రూ.10 లక్షల నగదుతో పాటు వివిధ జ్యువెలరీ షాపుల నుంచి 4.120 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ రూ.5.01 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్పీ సుస్మిత ఆర్., సీఐ ఎం.వి. సుభాష్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

