7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి – క్రీడలకు యువత అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు – జూలై 15 నుంచి నియోజకవర్గ స్థాయి పోటీలు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అపరిమిత అవకాశాలు కల్పిస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘అమరావతి ఛాంపియన్షిప్–2026 – ఒకే స్ఫూర్తి.. ఒకే ఛాంపియన్షిప్.. అపరిమిత అవకాశాలు’ అనే నినాదంతో రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు అమరావతి ఛాంపియన్షిప్–2026 ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఛాంపియన్షిప్ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. 17 ఏళ్లలోపు బాలురు, బాలికలు, 23 ఏళ్లలోపు యువకులు, యువతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విలువిద్య, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు జూలై 15 నుంచి 25 వరకు, జిల్లా స్థాయి పోటీలు జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 21 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు మొత్తం రూ.91.90 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బహుమతి ప్రదానోత్సవం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్‌కుమార్ రెడ్డి, ఆర్డీవో కె. ప్రసన్నలక్ష్మి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎ.డి. వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

