ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలని చిట్ల దివాకర్ పిలుపు
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 7: కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు కృషి చేయాలని ప్రగతి నగర్ మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ అన్నారు. నిజాంపేట్ సర్కిల్‌కు ఇటీవల నియమితులైన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించిన సందర్భంగా ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 273వ డివిజన్ అధ్యక్షుడు మురళి, 275వ డివిజన్ అధ్యక్షుడు వాసు, 276వ డివిజన్ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం చిట్ల దివాకర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో డివిజన్ అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు సేవ చేయాలని కోరారు. రానున్న సీఎంసీ ఎన్నికల్లో డివిజన్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

