7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ ఎఐటీయూసీ నాలుగో మండల మహాసభలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ ఎఐటీయూసీ నాలుగో మండల మహాసభ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మండల అధ్యక్షుడు ఆశి యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర మున్సిపల్ సంఘం కార్యదర్శి జైపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు యేసురత్నం, ఎఐటీయూసీ ఉపాధ్యక్షుడు పాలబిందల శ్రీనివాస్, మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షుడు హరినాథరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందునుంచి కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు.

యూనియన్ల హక్కులు, కార్మిక–యాజమాన్య చర్చల వ్యవస్థను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు సూచించిన మేరకు కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కార్మికులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న మేడ్చల్ జిల్లా నాలుగో మహాసభలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించి కార్మిక సమస్యల పరిష్కారానికి మరింత బలోపేతంగా పోరాటాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహాసభలో దస్తగిరి, భాగ్యమ్మ, పుష్ప, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజాంపేట్ ఎఐటీయూసీ అధ్యక్షుడిగా మేకల బాలకృష్ణ, మండల కార్యదర్శిగా ఆశి యాదయ్య, కన్వీనర్‌గా దస్తగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

