పరిశ్రమల పొగతో ఊపిరాడని జీవితం…
కాలుష్యపు కబంధ హస్తాల్లో కుత్బుల్లాపూర్ ప్రజలు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: ఉదయం ఆరు గంటలు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఓ కాలనీలో సూర్యుడు ఇంకా పూర్తిగా వెలుగులు విరజిమ్మలేదు. కానీ గాలిలో ఇప్పటికే ఒక విచిత్రమైన వాసన. రోడ్డు పక్కన నిలబడ్డ వృద్ధుడు దగ్గుతూ ఇంటి ముందు కూర్చున్నాడు. స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పిల్లాడు మాస్క్ పెట్టుకుంటున్నాడు. ఇంటి ముంగిట ఆరేసిన బట్టలపై నల్లటి ధూళి పొర కనిపిస్తోంది. బోర్వెల్ నుంచి వచ్చిన నీటికి కొద్దిగా పసుపు రంగు. ఇదే నేటి జీడిమెట్ల వాస్తవ చిత్రం. ఒకప్పుడు పరిశ్రమలతో ఉపాధి కల్పించిన ప్రాంతం… నేడు కాలుష్యంతో ప్రజలను భయపెడుతున్న ప్రాంతంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, చింతల్, సూరారం, సుభాష్‌నగర్, గాంధీనగర్, భాగ్యనగర్ కాలనీ, వినాయక్‌నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే వేలాది కుటుంబాలు ఏళ్లుగా కాలుష్య భారాన్ని మోస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి పారిశ్రామిక హబ్‌గా పేరొందిన జీడిమెట్లలో వందల సంఖ్యలో రసాయన, ఫార్మా, బల్క్ డ్రగ్, ఇంజినీరింగ్ పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నగర ఆర్థికాభివృద్ధికి ఈ పరిశ్రమలు ఎంతగానో తోడ్పడ్డాయి. కానీ అదే సమయంలో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు పచ్చగా కనిపించిన ప్రాంతాల్లో నేడు కాంక్రీట్ జంగిల్ పెరిగిపోయింది. పరిశ్రమల చిమ్నీల నుంచి వెలువడే పొగ, భారీ వాహనాల రాకపోకలు, రసాయన వ్యర్థాల నిర్వహణలో లోపాలు ప్రజల ఆరోగ్యానికి పెను సవాలుగా మారాయి.

జీడిమెట్లలో… స్వచ్ఛమైన గాలి కరువాయే…
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళి కణాలు (PM2.5, PM10) పరిమిత స్థాయిలో ఉండాలి. కానీ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇవి తరచూ అధికంగా నమోదవుతున్నాయని పర్యావరణ అధ్యయనాలు చెబుతున్నాయి.
గాలిలో కలిసే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, రసాయన వాయువులు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో రసాయన దుర్వాసన వస్తోందని స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. “గాలి పీల్చడానికి కూడా భయపడే పరిస్థితి రావడం అభివృద్ధి కాదు” అని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు. జీడిమెట్లలో సమస్య కేవలం గాలితో ముగియడం లేదు. భూగర్భ జలాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. చాలా కాలనీల్లో బోర్వెల్ నీటిని తాగడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. గతంలో నిర్వహించిన పలు అధ్యయనాల్లో పరిశ్రమల ప్రభావం వల్ల భూగర్భ జలాల నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించారు.
ఒకప్పుడు ఇంటి బోర్ నుంచి వచ్చే నీటిని తాగేవారు. ఇప్పుడు వాటర్ క్యాన్లు, ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటి కోసం అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే…
ఉపాధి ఇచ్చే పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అభివృద్ధి ఎంతవరకు సమంజసం?
ప్రతి ఇంట్లో ఒక రోగి… కాలుష్యానికి ఆరోగ్యం బలవుతోంది
జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వైద్యులను అడిగితే ఒకే సమాధానం వినిపిస్తుంది. శ్వాసకోశ సమస్యలు… ఆస్తమా… అలర్జీలు… దీర్ఘకాలిక దగ్గు… కళ్ల మంట… చర్మవ్యాధులు… ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. పిల్లలు బయట ఆడుకోవడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడితే అది కేవలం ఆరోగ్య సమస్య కాదు… సమాజం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభం. ఇక మరో కీలక అంశం ఆర్థిక భారం. కాలుష్యం అంటే కేవలం పొగ కాదు. అది కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం. శుద్ధి చేసిన నీరు కొనాలి… ఆసుపత్రులకు వెళ్లాలి… మందులు కొనాలి… ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసుకోవాలి… ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కాలుష్యం కనిపించదు… కానీ దాని ఖర్చు ప్రతి ఇంటికి తెలుస్తోంది.

ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే జీడిమెట్ల భవిష్యత్ మరింత ప్రమాదంలో పడే అవకాశం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు:
° ప్రతి పరిశ్రమకు 24 గంటల కాలుష్య మానిటరింగ్ వ్యవస్థ.
° అక్రమ వ్యర్థాల విడుదలపై కఠిన చర్యలు.
° కాలుష్య స్థాయిలను ప్రజలకు రియల్‌టైమ్‌లో అందుబాటులో ఉంచడం.
° భూగర్భ జలాలపై నిరంతర పరిశీలన.
° భారీ స్థాయిలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి.
° రెడ్ కేటగిరీ పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడం.
° ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం.

