చెరువులు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమీక్ష
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతతో పూర్తి చేయాలని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతి నగర్‌లోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన ఎమ్మెల్యే, తుర్క చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పత్తికుంట, మేడికుంట, అంబీర్ చెరువుల అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు.
సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, కొత్త వీధి దీపాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2బీహెచ్‌కే గృహ సముదాయాల్లో అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యంతో కల్పించాలని, ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. నిజాంపేట్ సర్కిల్లో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని నిర్ణీత గడువులో, నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో నిజాంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ షబ్బీర్ అలీ, డిప్యూటీ తహశీల్దార్ ఉమామహేశ్వర రెడ్డి, ఇరిగేషన్ డీఈ రూప్‌లాల్, అధికారులు వీరారెడ్డి, ఏఈ రవి, ఇంజినీరింగ్, జలమండలి శాఖల అధికారులు, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

