7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహణ – 60 ఫిర్యాదులు స్వీకరణ – త్వరిత, పారదర్శక విచారణకు అధికారులకు ఆదేశాలు ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్రావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సాంకేతికత ఆధారంగా, పేపర్లెస్ విధానంలో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 60 ఫిర్యాదులు అందగా, వాటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుదారుతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలను ఓపికగా విన్నారు. ఫిర్యాదులపై చట్టప్రకారం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అలాగే విచారణ నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా తమ సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.

అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు మీకోసం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని వెల్లడించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా పారదర్శక సేవలు కొనసాగిస్తామని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.

