న్యూ షాపూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 16: తాగునీటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందంటూ న్యూ షాపూర్‌నగర్‌లో మహిళలు, స్థానిక ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూ షాపూర్‌నగర్‌లో నెలకొన్న మంచినీటి సమస్యపై మహిళలు, స్థానిక ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సూరారం డివిజన్ సీనియర్ నాయకులు పుప్పాల భాస్కర్, విశ్వకర్మ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు మౌలిక సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు వంటి ప్రాథమిక సమస్యలను కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోగా ప్రజల సమస్యలు మరింత పెరిగాయని విమర్శించారు. సూరారం డివిజన్ సీనియర్ నాయకులు పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ కాలనీల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, జలమండలి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదన్నారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. విశ్వకర్మ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. న్యూ షాపూర్‌నగర్‌లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, క్రమబద్ధమైన నీటి సరఫరా చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళలు, స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

