వైరల్ వీడియోతో కలకలం.. విచారణకు ప్రజల డిమాండ్
7టీవీ ఫోకస్, మిడ్జిల్, జూన్ 19: మిడ్జిల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో స్థానికంగా చర్చనీయాంశమైంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, ధరణి సేవలు, రెవెన్యూ సంబంధిత పనుల విషయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. వైరల్ వీడియోలో గతంలో మీసేవ కేంద్రం నిర్వహించిన వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు పేర్కొన్న పలు అంశాలపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు, ధరణి సేవలు, ఇతర రెవెన్యూ పనుల కోసం ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మండల వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో వచ్చిన ఆరోపణలను కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ఖండించారు. తనపై వ్యక్తిగత కక్షతోనే తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమతి లేకుండా వీడియో తీసి ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని తెలిపారు. ఇటీవల వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి నిర్వహిస్తున్న మీసేవ కేంద్రంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని, ప్రభుత్వ నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నందుకే తనపై కక్ష సాధింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశాంత్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వైరల్ వీడియోలోని ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా నిజానిజాలు వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

