ధర్నాలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. జీవో 641 ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రజల హామీని నిలబెట్టుకోలేకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సవాల్
షాద్‌నగర్, జూలై 7 (7టీవీ ఫోకస్): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో సిద్దాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సమంజసం కాదని అన్నారు. దీనివల్ల రైతులతో పాటు పరిసర గ్రామాలు, తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. గతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కాదని ఎమ్మెల్యే వీర్లపల్లి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. జీవో నంబర్ 641ను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, డంపింగ్ యార్డు ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే వీర్లపల్లి, కాంగ్రెస్ నాయకులు రూ.50 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును సిద్దాపూర్‌కు తీసుకొచ్చి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడాన్ని సహించబోమన్నారు. డంపింగ్ యార్డు రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, దేవేందర్ యాదవ్, కోస్గి శ్రీనివాస్, యుగంధర్, రామకృష్ణ, దినేష్, శివాచారి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


